అమీర్ ‘సిక్సర్’
అమీర్‌ఖాన్మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ... బాలీవుడ్ సూపర్ స్టార్ ... సెన్సిబుల్ డైరెక్టర్...అంతేనా...గ్రేట్ ప్రొడ్యూసర్ కూడా అంటారెవరైనా... ఎందుకంటే... నిర్మాతగా నూటికి నూరుశాతం సక్సెస్ కొట్టిన క్రెడిట్ ఆయనకే దక్కింది. ‘లగాన్’, ‘తారే జమీన్ పర్’, ‘జానే తూ యా జానేనా’, ‘పీప్లీలైవ్’, ‘దోభీఘాట్’ సహా గతవారం విడుదలైన ‘ఢిల్లీ బెల్లీ’తో అమీర్ సక్సెస్ ‘సిక్సర్’ కొట్టాడు. ఇంతకీ అమీర్‌ఖాన్ సక్సెస్ సీక్రేట్ ఏంటీ?
‘‘చాలామంది నాది గోల్డెన్ హ్యాండ్ అంటుంటారు. అయితే నా సినిమాలు సూపర్‌హిట్ కావడానికి నేనొక్కడినే కారణం కాదు. నా దగ్గరికి మంచి స్క్రిప్టులు తీసుకొస్తున్న రచయితలు... వాటిని చక్కగా తీస్తున్న దర్శకులు లేకుండా నేను లేను. ఒక సినిమాకు చాలామంది సృజనశీలురు కలిసి పనిచేస్తారు. వారిని సమన్వయపరచడమే ఓ నిర్మాతగా నేను చేస్తున్నది. ఓ సినిమా బాగా ఆడితే ఆ క్రెడిట్ తప్పకుండా రచయిత, దర్శకుడికే ఇవ్వాలి’’ ఇదీ నిర్మాతగా అమీర్‌ఖాన్ అభిప్రాయం.అమీర్‌ఖాన్ ఎందుకు సక్సెస్ అవుతున్నాడు... నిర్మాతగా ఇన్ని వరుస హిట్లు ఎలా సాధ్యమవుతున్నాయి... ఇలాంటి ప్రశ్నలకు అమీర్ తన తాజా చిత్రం ‘ఢిల్లీబెల్లీ’ విడుదల సందర్భంగా ఇచ్చిన సమాధానం ఇది. ఇప్పుడు అమీర్‌ఖాన్ సూపర్‌స్టార్ మాత్రమే కాదు... ఉత్తమ కథలను, ఉన్నత విలువలను... కళను, వ్యాపారాన్ని ఒడిసి పట్టుకున్న సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్. వరుసగా ఆరు హిట్లతో ‘సిక్సర్’ కొట్టిన ఆల్‌రౌండర్.
వినోదమే ప్రధానంగా ‘ఢిల్లీబెల్లీ’సినిమా అంటే సృజనాత్మక ప్రక్రియ. అది ఎంత కొత్తగా ఉంటే అంతమందిని ఆకట్టుకుంటుంది. అందుకే ప్రతీ సినిమాను కొత్తగా తీయాలనే అమీర్ తహతహలాడుతుంతాడు. తాజా ‘ఢిల్లీబెల్లీ’ ఆయన నిర్మించిన గత చిత్రాలకు భిన్నంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ద్వారా అభినయ్ దేవ్‌కు దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు అమీర్. ఢిల్లీలోని ఓ పత్రికలో పనిచేసే ముగ్గురు యువకులు తాపి (ఇమ్రాన్‌ఖాన్), నితిన్ (కునాల్‌రాయ్ కపూర్), అరూప్ (వీర్‌దాస్)ల జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ‘ఢిల్లీ బెల్లీ’. ఎయిర్ హోస్టేస్ సోనియా (షెహనాజ్) తాపీ లవర్. ఆమె ఓ వజ్రాల ప్యాకెట్‌ను వీరి రూమ్‌కు చేరుస్తుంది. వాటిని ఓ గ్యాంగ్‌స్టర్‌కు చేర్చమని తాపిని రిక్వెస్ట్ చేస్తుంది. రోడ్‌సైడ్ ఫుడ్ తిన్న నితిన్‌కు కడుపులో గుడుగుడ మొదలవుతుంది. డాక్టర్ సలహా మేరకు ‘స్టూల్’ శాంపిల్ ప్యాకెట్ మెడికల్ లాబ్‌కు పంపించాలి. ఇక్కడే ప్యాకెట్లు మారిపోయి. కథ అడ్డం తిరుతుంది. ఈ సిట్యుయేషన్ కామెడీని దర్శకుడు చక్కగా డీల్ చేశాడు. ఫలితంగా మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌ను ఈ సినిమా బాగా ఆకట్టుకుంటోంది. సినిమా అంతా ఇంగ్లీష్, హిందీలో సాగుతుంది. ‘ఢిల్లీబెల్లీ’ అమీర్ నిర్మించిన ఆరో సినిమా. అయితే గత పదేళ్లలో నిర్మాతగా కేవలం ఆరు సినిమాలే తీసిన (మొదటి సినిమా లగాన్ 15 జూన్ 2001న విడుదలైంది) అమీర్ స్లో అండ్ స్టడీగా ముందుకుసాగుతున్నాడు.
‘లగాన్’తో షురూ...2001... అప్పటికే అమీర్‌ఖాన్ ‘రాజా హిందుస్థానీ’, ‘ఇష్క్’, ‘గులామ్’, ‘సర్ఫరోష్’, ‘మన్’ వంటి రెగ్యులర్ కమర్షియల్ హిట్స్‌తో మంచి ఊపుమీదున్నాడు. అయినా సరే అతడిలోని నటుడు మాత్రం సంతృప్తిగా లేడు. ఈ రొటీన్ మాస్ మసాలా నుంచి బయటపడాలనుకున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో... చాలాకాలంగా ఓ స్క్రిప్టు పట్టుకుని తన చుట్టూ తిరుగుతున్న దర్శకుడు అశుతోష్ గోవారికర్ గుర్తుకొచ్చాడు. ఒక హీరోగా అతడు చెప్పిన ‘లగాన్’ స్క్రిప్టును అప్పటికే చాలాసార్లు మార్పులు చేసి తీసుకురమ్మన్నాడు. ఇప్పుడిక ఆ సినిమాను తనే నిర్మిస్తే.. తనకు నచ్చిన విధంగా తీయొచ్చనే ఆలోచన అమీర్‌కు కలిగింది. 25 కోట్ల ఈ భారీ బడ్జెట్ సినిమాను తానే నిర్మిస్తానని... స్క్రిప్టు పక్కాగా ఉంటేనే పని మొదలెడతానని చెప్పాడు. నిర్మాతగా ‘లగాన్’ అమీర్‌ఖాన్ తొలి సినిమా. అమీర్‌ఖాన్ ప్రొడక్షన్ బ్యానర్ మీద రూపొందిన ఈ సినిమా అతడి ఆశలను వమ్ము చేయలేదు. ‘లగాన్’ 57.8 కోట్ల రెవిన్యూతో బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలవడమేగాక... ఆస్కార్ అవార్డులకు భారతీయ ఎంట్రీగా ఎంపికయ్యింది. తను నిర్మాతగా మారడం వల్లే ‘లగాన్’ వెలుగుచూసిందని... లేదంటే మధ్యలోనే ఆగిపోయి ఉండేదని... లెక్కలేనన్ని కష్టనష్టాలను ఈ సినిమా నిర్మాణంలో చవిచూశానని ఆ తర్వాత అమీర్‌ఖాన్ చెప్పాడు. ఈ విజయం ఆయనలో కొత్త ఆలోచనలకు తెరలేపింది. నిజానికి ‘లగాన్’ నుంచే అమీర్ తన దృక్పథాన్ని మార్చుకున్నాడని చెప్పొచ్చు.
స్క్రిప్టు నచ్చితేనే...అమీర్ కాకుండా మరొకరైతే ‘లగాన్’ ఇచ్చిన సక్సెస్ కిక్‌తో వెంటనే మరో సినిమాను నిర్మించి... వచ్చిన ఇమేజ్‌ను క్యాష్ చేసుకునేవారు. కానీ ఈ మిస్టర్ పెర్‌ఫెక్షనిస్టుకు కాసులతో పాటు కళపై కూడా అభిమానం ఉంది. అందుకే మంచి స్క్రిప్టు కోసం దాదాపుగా ఆరు సంవత్సరాలు వేచి చూశాడు. అమోల్ గుప్తా తన భార్య దీపాభాటియాతో కలసి కొన్ని ఏళ్లపాటు పరిశోధించి రాసిన ‘తారే జమీన్ పర్’ అమీర్‌ఖాన్‌కు బాగా నచ్చింది. డిస్లెక్సియా వ్యాధితో బాధపడే ఎనిమిదేళ్ల ఇషాన్ నందకిషోర్ అవస్తీ (దర్శీల్ సఫారి) అనే పిల్లాడి కథ ఇది. ఈ సినిమాను నిర్మించడమేగాక అమీర్‌ఖానే స్వయంగా డైరెక్ట్ చేయడం విశేషం. ‘తారే జమీన్ పర్’కు బాలనటుడు దర్శీల్‌సఫారీ హీరో కాబట్టి అమీర్ గొప్ప నటుడైనప్పటికీ తన పాత్రమేరకే సినిమాలో కనిపించడం ఆయనలోని సృజనశీలతకు నిదర్శనం. అంతేకాదు.. టైటిల్స్‌లో సైతం దర్శీల్ సఫారీ తర్వాతే తన పేరు వేసుకోవడం అమీర్ ప్రొఫెషనలిజాన్ని.... సినిమాపట్ల ఆయనకున్న అంకితభావాన్ని తెలుపుతుంది. సిన్సియర్‌గా తీసిన ఈ సినిమా ఆబాల గోపాలన్ని ఆకట్టుకుని కాసుల వర్షాన్ని కురిపించింది. స్క్రిప్టును నమ్మి ఓ సినిమాను సిన్సియర్‌గా తీస్తే తప్పకుండా అది మంచి ఫలితాన్నే ఇస్తుందని అమీర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కేవలం 12 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 131కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి అమీర్‌ఖాన్ ప్రత్యేకతను ఘనంగా చాటింది. అంతేకాదు ఉత్తమ కుటుంబకథా చిత్రంగా జాతీయ అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత మరుసటి యేడాదే తన మేనల్లుడు ఇమ్రాన్‌ఖాన్ హీరోగా ‘జానే తు యా జానేనా’ నిర్మించాడు. అబ్బాస్ టైర్‌వాలా డైరెక్ట్ చేసిన ఈ లో బడ్జెట్ సినిమా కూడా బాక్సాఫీసు దగ్గర ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది.
లైవ్‌లోకి వచ్చిన ‘పీప్లీ’మనదేశంలో రైతుల ఆత్మహత్యలు సర్వసాధారణంగా మారాయి. రైతు గోడును పట్టించుకునే ప్రభుత్వాలుకానీ, ప్రజాప్రతినిధులుకానీ ఎవరూ లేరు. అలాంటప్పుడు అప్పుల బాధలో కూరుకుపోయిన రైతన్నకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. అయితే ఓ రైతు ఆత్మహత్య ప్రయత్నాన్ని కూడా ఈ సభ్యసమాజం వినోదంగానే చూస్తోంది. ఈ విషయాన్నే సెటైరికల్‌గా చూపుతూ ‘పీప్లీలైవ్’ నిర్మించాడు అమీర్‌ఖాన్. జర్నలిస్టు అయిన అనుషా రిజ్వి ఈ సినిమా స్క్రిప్టును ఈమెయిల్‌లో పంపితే చూసి ఓకే చేశాడు అమీర్. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలోని కొందరిని తీసుకుని ‘పీప్లీలైవ్’లో నటీనటులుగా అవకాశం కల్పించాడు. గ్రామీణ భారతాన్ని, మీడియా ఓవరాక్షన్‌ను అద్భుతంగా చూపిన ఈ సినిమా మన దేశం నుంచి 83వ ఆస్కార్ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో నామినేట్ అయ్యింది.
విభిన్న కథాంశాలే ఆయన బలంనటుడిగా ఎంతటి వైవిధ్యమైన పాత్రలను ఎంపికచేసుకుంటాడో... నిర్మాతగా కూడా డిఫరెంట్ కథాంశాలను ఎంచుకోవడం అమీర్ ప్రత్యేకత. ఓవైపు స్టార్ హీరోగా ‘గజిని’లాంటి పాత్రలను అద్భుతంగా పోషిస్తూనే నిర్మాతగా ‘దోభీఘాట్’లాంటి సినిమాలు చేయడం ఆయనకే చెల్లింది. ముంబయ్‌లోని ధోబీఘాట్‌ను ఈ సినిమాలో రియలిస్టిక్‌గా చిత్రీకరించారు. ఈ సినిమాను స్వయంగా అమీర్ భార్య కిరణ్‌రావ్ డైరెక్ట్ చేయడం విశేషం. ఓ నిర్మాతగా కేవలం డబ్బులు పెట్టడానికి అమీర్ ససేమిరా అంటాడు. మంచి స్క్రిప్టుతో తను కన్విన్స్ అయితే ఎవరినైనా డైరెక్టర్‌ను చేసేందుకు అమీర్ వెనుకాడరు. అదేవిధంగా సినిమాలో అవసరమైతే ఎంత చిన్న పాత్రలోనైనా కనిపించేందుకు రెడీ అవుతాడు. ‘తారే జమీన్ పర్’లో టీచర్‌గా సెకండాఫ్‌లో తెరపై కనిపిస్తాడు. అలాగే ‘దోభీఘాట్’లో పెయింటర్‌గా... ‘ఢిల్లీ బెల్లీ’లో టైటిల్స్ రోల్ అవుతుంటే కనిపించి ఆడియన్స్‌లో ఆసక్తిని రేకెత్తించాడు. ఇక సరికొత్త పబ్లిసిటీతో అందర్నీ ఆకట్టుకునేందుకు క్రియేటివ్ ఐడియాలను ప్రదర్శిస్తాడు. ‘పీప్లీలైవ్’ పబ్లిసిటీలో భాగంగా లైవ్‌షోలలో కనిపించి ఆశ్చర్యపరిస్తే... ‘దోభీఘాట్’ విడుదలకు ముందు ఆయన మారువేషాలు వేసుకుని ఆయా నగరాల్లో తిరిగాడు. ఇలా... ఏ సినిమాకైనా తన స్టార్ అట్రాక్షన్‌తో మంచి పబ్లిసిటీని తీసుకురావడం ఈ మిస్టర్ పర్‌ఫెక్షనిస్టుకు అలవాటుగా మారింది. అయితే ఇదంతా పబ్లిసిటీకి పనికొచ్చినప్పటికీ... కథలపరంగా ఆయన నిర్మించిన సినిమాలు విభిన్నంగా ఉండటం వల్లే అమీర్ నిర్మాతగా సక్సెస్‌ఫుల్‌గా ‘సిక్సర్’ కొట్టాడు. -చల్లా శ్రీనివాస్
‘మేడ్’ ఫర్ ఈచ్ అదర్...కిరణ్‌రావ్...కళ్లజోడుతో క్యూట్‌గా కనిపించే ఈ అమ్మాయి అశుతోష్ గోవారికర్ తీసిన ‘లగాన్’కు అసిస్టెంట్ డైరెక్టర్. ఈ సినిమా నిర్మాణానికి ముందే అమీర్‌ఖాన్ 16 ఏళ్ల పాటు కాపురం చేసిన మొదటి భార్య రీనాదత్తాతో తెగతెంపులు చేసుకుని ఒంటరివాడయ్యాడు. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్ కాస్తా అమీర్‌కు అసిస్టెంట్‌గా మారింది. పనిలో ఆమె చురుకుతనాన్ని, పరిశీలనను, తన పట్ల చూపుతున్న అభిమానాన్ని గమనించిన అమీర్‌ఖాన్ క్రమంగా ఆమెపట్ల ఆకర్షితుడయ్యాడు. పైగా ఈ సినిమాకు నిర్మాణబాధ్యతలు కూడా తలకెత్తుకోవడంతో అతడికి కిరణ్‌రావ్ సపోర్టుగా నిలిచింది. ఈ అనుబంధమే క్రమంగా ప్రేమగా మారి వారిద్దరూ 2005లో ఒకటయ్యారు. అమీర్ జీవితంలోకి కిరణ్ వచ్చిన తర్వాత అతడి లైఫ్‌స్టయిల్, ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయింది. ఒకవిధంగా కిరణ్ పరిచయం తర్వాతే అమీర్ నిర్మాణరంగంవైపు వేగంగా అడుగులు వేశాడని చెప్పొచ్చు. కిరణ్ సహకారంతో ఇప్పటిదాకా ఆరు సినిమాలు నిర్మిస్తే అవన్నీ కూడా డిఫరెంట్‌గా ఉండి... కాసుల వర్షాన్ని కురిపించడం విశేషం. కిరణ్‌రావ్ దర్శకత్వ ప్రతిభను గమనించిన ఆయన ‘దోభీఘాట్’ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. నిర్మాతగా అమీర్ దర్శకులకు ‘డ్రీమ్ ప్రొడ్యూసర్’ అని కితాబునిస్తుంది కిరణ్‌రావ్. ఒక స్క్రిప్ట్ ఫైనల్ చేసేముందు వీరిద్దరూ చాలా కసరత్తే చేస్తారు. స్కిప్టు పక్కాగా వచ్చేదాకా ప్రాజెక్టును ప్రారంభించరు. ఒకసారి స్క్రిప్టు, డైరెక్టర్ ఫైనల్ అయితే అమీర్ యూనిట్‌కు పూర్తి స్వేచ్ఛనిస్తాడు. క్వాలిటీని చూస్తాడేకానీ కాస్ట్ గురించి అస్సలు పట్టించుకోడు. అదేవిధంగా సినిమాకు అవసరమైతేనే అందులో నటించేందుకు ఇష్టపడతాడుకానీ నిర్మాతను కాబట్టి తనే కనిపించాలనే ధోరణి ఆయనలో ఉండదు. ఈ క్వాలిటీసే అమీర్‌ను సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌ను చేశాయి.
వసూల్ రాజా1. లగాన్ (2001)... నిర్మాణవ్యయం 25 కోట్లు... వసూలు చేసింది సుమారు 58 కోట్లు2. తారే జమీన్ పర్ (2007) ... నిర్మాణ వ్యయం 12 కోట్లు... వసూలు చేసింది 131 కోట్లు3. జానే తు యా జానేనా (2008)... నిర్మాణ వ్యయం 11 కోట్లు... వసూలు చేసింది 56 కోట్లు4. పీప్లీలైవ్ (2010)... నిర్మాణ వ్యయం 10 కోట్లు... వసూలు చేసింది సుమారు 30 కోట్లు5. దోభీఘాట్ (2011)... నిర్మాణ వ్యయం 11 కోట్లు... వసూలు చేసింది 14 కోట్లు6. ఢిల్లీ బెల్లీ (2011)... నిర్మాణ వ్యయం 25 కోట్లు... వసూలు చేసింది మూడురోజుల్లో సుమారు 22 కోట్లు
No comments:
Post a Comment